Sat. Jan 11th, 2025

చంద్రబాబు @ 40 రాజకీయ ఏళ్లు! ఇప్పటికైనా ఒక్క నిజం నమ్మరా!

కొందరు వ్యక్తులు ఉంటారు. వారికి ప్రతిదీ అనుమానమే. ఎవడైనా ‘నీ పేరేంటి’ అనడిగితే చాలు.. ‘నా పేరు వీడికెందుకు.. పేరులో తోక చెబితే కులం తెలుసుకోవాలనుకుంటున్నాడా… పేరును బట్టి ఊరు తెలుసుకోవాలనుకుంటున్నాడా..? మతం తెలుసుకోవాలనుకుంటున్నాడా?’… ఇలా సమాధానం చెప్పకుండానే సవాలక్ష సందేహాల్లో మునిగిపోతారు. వారు ‘నిత్యశంకితులు’!

కొందరు వ్యక్తులు ఉంటారు. వారు సాధారణంగా చాలా విషయాల్లో నిజం చెప్పరు. అబద్ధం చెప్పి ఎదుటి వాళ్లను మోసం చేయాలని అన్నివేళలా వారి ఆలోచన కాకపోవచ్చు. కానీ నిజం ఎందుకు చెప్పాలి? ఎదుటి వాడికి నిజం ఎందుకు తెలియనివ్వాలి? నిజం తనొక్కడికి మాత్రం తెలిస్తేచాలు. అని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వారు ‘నిత్యాసత్యవాదులు’!

కొందరు వ్యక్తులు ఉంటారు. ఎప్పుడూ సగం నిజాలే చెబుతుంటారు. వారు చెబుతున్న తీరు చూస్తే ఇంతకు మించిన యథార్థవాదులు ఉండరని మనకు అనిపిస్తుంది. ఇంతకుమించి పారదర్శకంగా ఉండేవారు కనిపించరు అనిపిస్తుంది. అర్థసత్యాలు చెప్పడంలో వారికి ఓ ఎడ్వాంటేజీ ఉంటుంది. ప్రతి విషయాన్నీ తమకు అనుకూలంగా ఉండేలాగా చెబుతుంటారు. వారు ‘సదార్థవాదులు’.. అవును నిజమే.. యథార్థవాదులు కాదు.. సదా (ఎప్పుడూ) అర్థ (సగం) చెప్పేవాళ్లు.. ‘సదార్థవాదులు’!

కొందరు వ్యక్తులు ఉంటారు. ఉన్నత స్థానాల్లో ఉంటారు, అంటే చాలాగొప్పోళ్లు. కానీ ఎవ్వరినీ చూసినా భయం. తను చనువిస్తే చంక ఎక్కుతారనే భయం. తన బాల్యమిత్రులు కనిపించినా.. ముక్తసరిగా డాబుసరిగా ముగిస్తారు. ఎవ్వరితో చనువుగా ఉండినా సరే.. ఆ చనువును వారు మరోరకంగా ‘క్యాష్‌’ చేసేసుకుంటారని.. వీరి అనుమానం. ఆప్తులు, ఆశ్రితులు, మిత్రులు, హితులు, మార్గదర్శకులు.. ఇలా ఎవరి గురించి అడిగినా.. తమకెవ్వరూ అలాంటివాళ్లు లేరని, పైన చెప్పిన అనుమానంతోనే, బొంకుతారు. వారు ‘వ్యర్థవాదులు’!

READ MORE:  New Andhra CM Faces Daunting Challenges Ahead: Can He Rise To The Occasion?

ఈ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటీ బయటపడుతుంటాయి. నిత్యశంకితులు, నిత్యాసత్యవాదులు, సదార్థవాదులు, వ్యర్థవాదులు అందరూ కలిపి మూర్తీభవిస్తే..

అది మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.

ఆయన నలభయ్యేళ్ల రాజకీయ జీవితం అందుకు నిలువెత్తు నిదర్శనం.

చంద్రబాబునాయుడు నలభయ్యేళ్ల సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకోవడం చాలా గొప్ప విషయం. ఏదో ఆషామాషీ రాజకీయవేత్త అయితే.. నలభైకాదు యాభైఏళ్లు పూర్తి చేసుకున్న వాళ్లు కూడా అనేకమంది దొరకుతారు. కానీ.. రాజకీయంగా ఇరవయ్యేళ్ల అనుభవం గడవక ముందే ముఖ్యమంత్రి రేంజిలోని ఉన్నత స్థానానికి వెళ్లి.. పదిలంగా ఆ స్థాయికి తగ్గకుండా నలభయ్యేళ్ల ప్రస్థానం పూర్తిచేయడం మామూలు విషయంకాదు. ఎందుకంటే.. శిఖరాల మీద ఉన్న వారిని కిందికి తోసేయడానికి కుట్రలు చేసేవాళ్లు చుట్టూతా చాలామంది ఉంటారు. ఆ శిఖరం మీద తాముండాలని ఆశపడేవాళ్లూ ఉంటారు. అలాంటి ఎవ్వరికీ ఆస్కారం ఇవ్వకుండా… పొజిషన్‌ చెదరకుండా.. నలభయ్యేళ్ల ప్రస్థానం పూర్తి చేసినందుకు చంద్రబాబుకు అభినందనలు.

ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు అన్ని పత్రికలకు టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అనేక సంగతులు పంచుకున్నారు. తన అనుభవాన్ని పాఠాలుగా కూడా చెప్తానన్నారు. కానీ ఆయన అన్నీ నలభయ్యేళ్లు పూర్తయిన తర్వాత అయినా ఆయన మనసును తెరచిన పుస్తకంలాగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారా? అన్నీ నిజాలే చెప్పారా? అనేది అనుమానమే.

‘నాకు మెంటార్లు లేరు’, ‘సంస్కరణల్ని నేనే అందరికీ నేర్పా’, ‘వైఎస్‌కు నేనే టిక్కెట్‌ ఇప్పించా’.. ‘నేను తల్లిగర్భం నుంచి రాలేదు.. ఆకాశం నుంచి ఊడిపడ్డా’ అనేవాక్యం తప్ప.. అన్నీ స్వాతిశయంతో కూడిన డైలాగులనే ముఖ్యమంత్రి వల్లించారు. ఎందుకింత ఆత్మవంచన. కనీసం ఇంత సుదీరెకాలం గడచిన తర్వాత.. ఏ సందర్భంలోనైనా తనను తాను నిష్కల్మషంగా తన ప్రజల ముందు ఆవిష్కరించుకోలేని వ్యక్తిగా ఆయన ఎందుకున్నారు? ఎందుకిలాంటివి చెబుతున్నారు? అనే విశ్లేషణ ఇది.

READ MORE:  Gypsies Of Yore - The 'Folk Art' Of Magical Tricks And Jugglery By 'Katipapalu'

మెంటార్‌లు లేరు..

నాయకులు తమను మించిన వారులేరని చెప్పుకోవడానికి చాలా తపిస్తుంటారు. ఆ చంద్రబాబు లాంటి వారికి ఇది మరీ అవసరం. అందుకు ఎన్ని బొంకులైనా చెప్పొచ్చు. కానీ మెంటార్‌లు లేరని ఎందుకు అనాలి. గురువులు, చేరదీసిన వారు లేకుండానే… ఎవరైనా రాజకీయాల్లో ఎదుగుతారా? సాధ్యమేనా?

తాను స్వయంకృషితో పైకి వచ్చిన వాడిని అని చెప్పుకోవడం ఆయనకు కోరిక కావొచ్చు. అందుకు మెంటార్‌లే లేరని అనాలా? గల్లా అరుణకుమారి తండ్రి అప్పట్లో ఎంపీ అయిన పి.రాజగోపాల నాయుడు ఆయనకు గురువు. అప్పట్లో వారి ఇంటివద్దనే చంద్రబాబు ఎక్కువ సమయం గడుపుతుండేవారు. కానీ ఆ సంగతి ఆయన చెప్పుకోరు. అరుణకుమారి ఎడ్వాంటేజీ తీసుకుంటుందేమో అని భయం.

మరీ అన్ని అనుమానాలా? అందుకే కొందరు ఆయనను ఎరిగిన వాళ్లు చంద్రబాబు తన నీడను కూడా తాను నమ్మరని అంటూఉంటారు.

ఆర్థిక సంస్కరణలు…

పీవీ నరసింహారావు అంటేనే ఆర్థిక సంస్కరణలు అని పెద్దలు చెబుతుంటారు. ఈ దేశంలోకి వాటిని తీసుకువచ్చిన ఘనత పూర్తిగా పీవీదే అని కాంగ్రెసేత పార్టీల వారు కూడా ఒప్పుకుంటూ ఉంటారు. అలాంటిది చంద్రబాబునాయుడు మాత్రం ఆర్థిక సంస్కరణలు అనే వాటిని ఈ దేశానికే తానే పరిచయం చేశానని చెప్పుకోవడం చిత్రం. ఇలా.. పరాయి వారి క్రెడిట్‌ను కూడా తన ఖాతాలోనే వేసుకోవాలనే కోరిక ఆయనకెందుకు.

ఆ మాటకొస్తే చంద్రబాబునాయుడు ఖాతాలోకే వచ్చే గొప్ప విషయాలు చాలా ఉండవచ్చు. వాటిని మాత్రం చెప్పుకుంటే సరిపోతుంది కదా..! స్వచ్ఛంగా ఉంటుంది కదా..! ఆయన సమస్త నిజాయతీతో చెప్పాడని ప్రజలు అనుకుంటారు కదా.. ఇలా అర్థసత్యాలను, అసత్యాలను కలగలిపి.. ఈ దేశానికి ఆర్థిక సంస్కరణలకు తానే మూల పురుషుడిని అన్నంత బిల్డప్‌లు ఎందుకివ్వాలి.

READ MORE:  Investment Prospects In AP Brighten With Chandrababu Naidu's Leadership (Part-3)

వైఎస్‌కు ఎమ్మెల్యే టిక్కెట్‌..

అలాంటి చంద్రబాబు చెప్పుకున్న డాబుసరి మాటల్లో వైఎస్‌ రాజశేఖర రెడ్డికి తానే ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇప్పించానని చెప్పుకోవడం కూడా ఒకటి. ఆ రోజుల్లో చంద్రబాబు ఇందిరా కాంగ్రెస్‌ తరఫున గెలిస్తే.. వైఎస్‌ సిండికేటెడ్‌ కాంగ్రెస్‌ (జాతీయ కాంగ్రెస్‌) తరఫున గెలిచారు. తర్వాత పార్టీలు విలీనం అయ్యాయి. వైఎస్‌ ప్రస్థానం యధావిధిగా సాగిపోయింది. ఆ తర్వాత ఆయన అంచెలంచెలుగా, కొన్ని ఎదురుదెబ్బలు తట్టుకుంటూ ఎదుగుతూ వచ్చారు. అలాంటిది.. ఇందిరాగాంధీకి తాను సిఫారసు చేసి.. వైఎస్‌కు టికెట్‌ ఇప్పించాననడం కూడా చిత్రమే.

ఒకదశలో.. ఇలాంటివి పోవాలి…

సాధారణంగా వ్యక్తులు ఎన్ని డాంబికాలు అయినా చెప్పుకుంటూ ఉండవచ్చు. కానీ.. ఒకదశ దాటాక అలాంటి పోచికోలు కబుర్ల మీద సాధారణంగా వారికే విరక్తి పుడుతుంది. కొన్నాళ్లు పూర్తి నిజాయితీగా.. అచ్చంగా నిజాలు మాత్రమే మాట్లాడుతూ బతకాలని అనిపిస్తుంది.

మరి 68 ఏళ్లు దాటిన వయసు వచ్చింది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం వచ్చింది. చంద్రబాబునాయుడుకు ఆ ‘నూరుశాతం నిజాయితీ’గా కొన్నాళ్లు బతుకుదాం అనే ఆలోచన రాలేదా?

ఇప్పుడు ప్రజల్లో మెదలుతున్న సందేహం ఇది. #KhabarLive

About The Author

Related Post

Copy link